వచ్చే 3 రోజులు జాగ్రత్త.. తెలుగు రాష్ట్రాలకు భారీ వాతావరణ హెచ్చరిక
తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు మండే ఎండలు ప్రజలను ఇబ్బందిపెడుతుండగా, మరోవైపు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు రోజురోజుకూ మారుతున్నాయి. ఉదయం నుంచి మండిపోతున్న ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పటికీ, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షాల సూచనలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోత తీవ్రంగా ఉండటంతో ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు.
వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చని అధికారులు తెలిపారు.
అమరావతి వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో గురువారం నుంచి శనివారం వరకు ఒకటి లేదా రెండు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని హెచ్చరించారు.
దక్షిణ కోస్తా జిల్లాల్లో కూడా ఇలాంటి వాతావరణమే కొనసాగనుంది. అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడటంతో పాటు గాలుల వేగం పెరగవచ్చని అధికారులు పేర్కొన్నారు. రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, కొన్ని ప్రాంతాల్లో గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని వెల్లడించారు.
ఇక తెలంగాణలో కూడా వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడినా, రాష్ట్రంలో దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీచుతున్నాయి. దీని ప్రభావంతో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
రాబోయే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు పెద్దగా తగ్గే సూచనలు లేవని వాతావరణ శాఖ తెలిపింది. ఎండలు కొనసాగుతూనే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే పరిస్థితి నెలకొనడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.