బెంగాల్‌లో మళ్లీ హింసా తాండవం! సువేందు అధికారి పీఏ చంద్రనాథ్‌పై కాల్పులు జరిపి హత్య

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతరం రాజకీయ హింస ఆగడం లేదు. సువేందు అధికారి సహాయకుడు చంద్రనాథ్ హత్యతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి.

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేడి తగ్గకముందే రాజకీయ హింస మరోసారి భయాందోళనలు కలిగిస్తోంది. బీజేపీ నేత సువేందు అధికారికి సన్నిహితుడిగా పనిచేస్తున్న చంద్రనాథ్ హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. నార్త్ 24 పరగణాల జిల్లాలో జరిగిన ఈ ఘటనతో రాజకీయ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.

సమాచారం ప్రకారం, మధ్యమ్‌గ్రామ్ ప్రాంతంలో కారులో వెళ్తున్న చంద్రనాథ్‌ను కొందరు దుండగులు అడ్డగించి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. వరుసగా నాలుగు రౌండ్లు కాల్చడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటన వెలుగులోకి రావడంతో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీగా మోహరించారు. రాజకీయ కక్షల కారణంగానే ఈ హత్య జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇక బెంగాల్‌లో గత 24 గంటల్లోనే పలు ప్రాంతాల్లో జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు రాజకీయ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. బసిర్‌హాట్, ఇంగ్లీష్ బజార్ వంటి ప్రాంతాల్లో బీజేపీ, టీఎంసీ శ్రేణుల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. మొత్తం ఎనిమిది జిల్లాల్లో ఇరవై ప్రాంతాల్లో అల్లర్లు నమోదైనట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

హింసాత్మక ఘటనల నేపథ్యంలో కోల్‌కతా సహా పలు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇప్పటివరకు 80 మందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు టీఎంసీ కూడా ఈ ఘటనలను ఖండిస్తూ, తమ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తోంది.

కొత్త ప్రభుత్వం ఏర్పాట్లకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనకు ముందే హింస పెరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button